నెఫ్రోప్లస్‌లో క్లినిక‌ల్ సిబ్బంది నియామ‌కాలు!

హైదరాబాద్‌: కంపెనీలు శ్రామిక శక్తిని తగ్గించుకోవాల‌ని చూస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో హైద‌రాబాద్‌కు చెందిన నెఫ్రోప్ల‌స్ సంస్థ రెండు వేల మందికిపైగా క్లినిక‌ల్ సిబ్బందిని నియ‌మించుకునేందుకు ప్ర‌ణాళిక రూపొందించింది. డ‌యాల‌సిస్ కేంద్రాల నిర్వ‌హ‌ణ‌లో దేశంలోనే అతిపెద్ద నెట్‌వ‌ర్క్ క‌లిగిన‌ నెఫ్రోప్ల‌స్.. దేశవ్యాప్తంగా 200కు పైగా సెంట‌ర్ల‌ను నిర్వ‌హిస్తున్న‌ది. క‌చ్చిత‌మైన నైపుణ్యాలు క‌లిగి రోగులకు నాణ్యమైన సేవ‌లు అందించే సుశిక్షితులైన, ధ్రువీక‌రించ‌బ‌డిన క్లినిక‌ల్ సిబ్బందిని స‌మ‌కూర్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా నెఫ్రోప్ల‌స్ ప‌నిచేస్తున్న‌ది. ఇందులోభాగంగా తన ప్రధాన ట్రెయినింగ్ అకాడ‌మీ అయిన ఎన్‌పీడియా ద్వారా కొత్త అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి, నియామ‌కాలు చేప‌ట్ట‌నున్న‌ది.


 ఆశావ‌హులైన విద్యార్థుల‌ను డ‌యాల‌సిస్ టెక్నీషియ‌న్లుగా తీర్చిదిద్ద‌డం కోసం నెఫ్రోప్ల‌స్‌ 2012లో ఎన్‌పీడియా ట్రెయినింగ్ అకాడ‌మీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ హీమోడయాలసిస్‌పై ప్ర‌ధానంగా దృష్టి సారించి డ‌యాల‌సిస్‌లో అంత‌ర్జాతీయస్థాయి ప్ర‌మాణాలు క‌లిగిన డిప్లొమాను అందిస్తున్న‌ది. ఇంట‌ర్‌ పూర్తిచేసినవారు ఈ డిప్లొమాలో చేర‌డానికి అర్హులు. ఇంట‌ర్‌ ఒకేష‌న్‌ల్ కోర్సు పూర్తిచేసిన వారు ఈ కోర్సులో చేర‌వ‌చ్చు. అంతేకాదు ఈ డిప్లొమాలో చేరాల‌నుకునే వారికి ఆరోగ్య‌సంర‌క్ష‌ణ‌కు సంబంధించి ఎలాంటి పూర్వ‌నుభ‌వం అవ‌స‌రం లేదు.